ఇంటర్వ్యూ : దర్శకుడు స్వ‌రూప్ – ‘కామెడీ, థ్రిల్లరే’ నా బలం !

Published on Jun 16, 2019 4:08 pm IST

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా వస్తోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. ఈ చిత్రం జూన్ 21న విడుద‌ల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…

అసలు, `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ` ఎలా మొదలైయ్యాడు ?

మన తెలుగులో డిక్టేటివ్ జోనర్ లో సినిమాలు ఈ మధ్యకాలంలో రాలేదు. ఎప్పటినుండో నా మనసులో ఉంది. తెలుగులో ఓ డిక్టేటివ్ మూవీ చేద్దామని. అలా కావాలనే ప్లాన్డ్ గా ఈ జోనర్ లో ఈ సినిమా చేయడం జరిగింది.

ఈ సినిమాకి ‘చంటబ్బాయి’ మూవీకి ప్రేరణ అనుకోవచ్చా ?

‘చంటబ్బాయి’ ఒక క్లాసిక్ మూవీ. ఖచ్చితంగా ఆ సినిమా ప్రభావం అయితే ఈ సినిమా పై ఉంది. అయితే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అది సినిమా చూశాక మీకు అర్ధమవుతుంది.

టైటిల్ ఎందుకు `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌` అని పెట్టారు ?

మొదట గూఢచారి అని పెట్టాలనుకున్నాం. కానీ అంతలో అది సినిమాగా వచ్చేసింది. దాంతో కొంచెం కొత్తగా పెట్టాలని, అది కూడా తెలుగులో పెద్ద పేరు పెట్టాలనే ఉద్దేశ్యంతో `ఏజెంట్ పక్కన సాయిశ్రీనివాస ఆత్రేయ‌` అని పెట్టడం జరిగింది. టైటిల్ వినగానే చాలమందికి కొత్తగా అనిపించింది. అయితే ఇలాంటి టైటిల్ పెడితే సినిమాకి ఎవరు వస్తారని కూడా అన్నారు. అందుకే మా టైటిల్ మీదే మేమే ఫన్నీ వీడియోస్ చేశాం.

ఈ సినిమా కథ గురించి చెప్పండి ?

థ్రిల్లర్ కాబట్టి కథ ఇప్పుడు చెప్పలేను. కథ రివీల్ చేస్తే.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా రివీల్ అవుతాం. అయితే స్టోరీ లైన్ విషయానికి వస్తే.. ఒక కేసు కూడా రాని డిక్టేటివ్ కి ఒక పెద్ద కేసు వస్తే.. దాన్ని అతను ఎలా హ్యాండిల్ చేశాడు అనేదే సినిమా.

ఈ సినిమా హీరో నవీన్ పొలిశెట్టిని పేస్ బుక్ లో అప్రోచ్ అయ్యారంట ?

అవును. ఈ కథ రాస్తునప్పుడే ఒక కొత్త హీరోతో చేద్దామని అనుకున్నాను. ఆ సమయంలో నవీన్ వీడియోస్ కొన్ని చూసాను. నాకు తన టైమింగ్ అంటే నాకు బాగా ఇష్టం. మేమిద్దరం సుమారు ఏడు ఎనిమిది నెలలు ట్రావెల్ అయ్యాం. ఆ తరువాతే నిర్మాతను కలిసాము.

నవీన్ పొలిశెట్టి స్వతహాగా రచయిత కూడా. మరి ఈ స్క్రిప్ట్ లో ఆయన ఇన్ వాల్వ్ ఎంత ఉంది ?

చాల ఉంది. తను నేను కూర్చొని తన టైమింగ్ కి తగ్గట్లు సీన్స్ మార్చాము. స్క్రిప్ట్ లో తన హెల్ప్ చాలా ఉంది.

ఈ సినిమాలో హీరోహీరోయిన్ల నటన గురించి చెప్పండి ?

హీరోయిన్ పాత్ర కూడా సినిమా మొత్తం ఉంటుంది. శృతి శ‌ర్మ చాలా బాగా చేసింది. అలాగే ఈ సినిమాలో నవీన్ కూడా అద్భుతంగా నటించారు. తన టైమింగ్ కూడా ఎక్స్‌ ట్రార్డినరీగా అనిపిస్తోంది.

మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి ?

కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ నేను ఏ సినిమా చేసిన కామెడీ, థ్రిల్లింగ్, డ్రామా అంశాలతోనే సినిమా చేస్తాను. అవే నాబలం అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూడాలనే ఆసక్తి బాగా ఉంది.

సంబంధిత సమాచారం :

More