తమిళనాడులో అజిత్ సినిమా సరికొత్త రికార్డు!

ajith
తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందిన ‘వేదాళం’ సినిమా ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ వద్ద సంచలన ఓపెనింగ్స్ రాబట్టి దూసుకుపోతోంది. ఈ ఏడాది తమిళంలో భారీ అంచనాలతో విడుదలవుతోన్న సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతూ వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 10న భారీ ఎత్తున విడుదలైంది. కమల్ హాసన్ హీరోగా నటించిన మరో సినిమా ‘తూంగవనం’ (తెలుగులో చీకటి రాజ్యం)తో పాటు ఒకేరోజున విడుదలైన ఈ సినిమా మొదటిరోజు ఏకంగా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని తమిళ ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తమిళంలో ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఇదే రికార్డు ఓపెనింగ్‌గా తెలుస్తోంది. రెండో రోజైన దీపావళి రోజునా ఈ సినిమా మంచి కలెక్షన్స్ సాధించిందని సమాచారం. మొత్తం రెండు రోజుల్లో తమిళనాడులో వేదాళం సినిమా 25 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక తమ హీరో సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం పట్ల అజిత్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. తెలుగులో గోపీచంద్‌తో గతంలో ‘శౌర్యం’ లాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన శివ వేదాళం సినిమాకు దర్శకత్వం వహించారు. ఏ.ఎ. రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు. త్వరలోనే ఈ సినిమా ‘ఆవేశం’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది.

Exit mobile version