‘అఖండ 2’లో సనాతన ధర్మ పరాక్రమం కనిపిస్తుంది – బాలకృష్ణ

Akhanda-2-Tamil

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ దివ్య యాక్షన్ చిత్రం అఖండ 2: తాండవం డిసెంబర్ 5, 2025న 2D, 3D ఫార్మాట్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ చెన్నై తనకు రెండో ఇల్లులా అనిపిస్తుందని, అఖండ 2ను 130 రోజుల్లో పలు దేశాల్లో అద్భుతంగా చిత్రీకరించామని చెప్పారు. ఈ చిత్రంలో సనాతన ధర్మ పరాక్రమం కనిపిస్తుందని, భవిష్యత్ తరాలు కూడా దీనివల్ల ఎంతో నేర్చుకుంటాయని తెలిపారు. తండ్రి ఎన్టీఆర్ తనకు గురువని, ఆయన బాటలోనే తాను ముందుకు సాగుతున్నానని అన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హిట్ల తర్వాత అఖండ 2 కూడా ఘనవిజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ అఖండ 2 కేవలం కమర్షియల్ సినిమా కాదు, భారతీయ ఆత్మను ప్రతిబింబించే కథ అని చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, పరమశివుడు స్వయంగా సందేశం ఇచ్చినట్టుగా అనిపిస్తుందని అన్నారు. దేశం, ధర్మం, దైవం, వేదం వంటి అంశాలను అద్భుతంగా ప్రెజెంట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల ప్రోత్సాహం ఆశిస్తున్నట్లు తెలిపారు.

Exit mobile version