డైలమాలో అక్కినేని అఖిల్ ‘లెనిన్’.. రిలీజ్ వాయిదా ఖాయమా..?

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కెరీర్‌లో ఎలాగైనా భారీ హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో ‘లెనిన్’ అనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ చిత్తూరు యాసలో డైలాగులు చెప్పబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ చిత్రాన్ని మే 1, 2026న విడుదల చేస్తామని మేకర్స్ గతంలోనే ప్రకటించారు.

అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే ‘లెనిన్’ విడుదల తేదీ మారే అవకాశం కనిపిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ని ఏప్రిల్ 30, 2026న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చరణ్ సినిమాకు కేవలం ఒక్కరోజు గ్యాప్‌లో అఖిల్ సినిమా రావడం బాక్సాఫీస్ వద్ద రిస్క్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ‘పెద్ది’ వంటి భారీ ప్రాజెక్టుతో పోటీ పడితే థియేటర్ల లభ్యత, ఓపెనింగ్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉండటంతో, లెనిన్ మేకర్స్ తమ సినిమాను వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు శివాజీ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Exit mobile version