నిర్మాతల మండలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వివాదంపై వివరణ !
Published on Feb 24, 2018 11:07 pm IST

ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమలో నడుస్తున్న నిర్మాతల మండలి, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటికే పలుమార్లు జరిగిన సమావేశాల్లో సమస్యకు పరిష్కారం దొరక్కపోవడం, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగిరాకపోవడంతో మార్చి 2 నుండి దక్షిణాది మొత్తం థియేటర్ల బంద్ తప్పేలా లేదు. అసలీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరు, వారి వలన నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు తలెత్తుతున్న సమస్యలేంటి అనే అంశాల మీద ఇక్కడ వివరంగా మాట్లాడుకుందాం..

అసలీ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరు :

గత 10 ఏళ్ళ క్రితం వరకు థియేటర్లన్నీ పాత పద్దతిలోనే సినిమాల్ని ప్రదర్శించేవారు. వాటి స్థానంలోకి డిజిటల్ ప్రొవైడర్లు డిజిటల్ ప్రొజెక్షన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. అందులో భాగంగా థియేటర్లలో ప్రొజెక్షన్ పరికరాల్ని కూడ ఉచితంగానే అమర్చారు ప్రొవైడర్లు.

ఈ కొత్త పద్దతిలో ఇరు వర్గాలకు సమన్యాయం జరిగేలా చూడటం కోసం ఒక కార్యవర్గం కూడ ఏర్పడింది. ఈ కార్యవర్గం డిజిటల్ ప్రొవైడర్లకు తాము వెచ్చించిన పెట్టుబడిని వెనక్కు రాబట్టుకునేలా 5 ఏళ్ల పాటు వినియోగదారుల నుండి వర్చ్యువల్ ప్రింట్ ఫీజు రూపంలో చార్జీలను వసూలు చేసే వెసులుబాటును కల్పించింది. ప్రపంచమంతా ఈ నియమాన్ని పాటిస్తున్నా ఇండియాలోని ప్రొవైడర్లు ‘క్యూబ్,యూ.ఎఫ్.ఓ, పి.ఎక్స్.డి, స్క్రాబుల్’ వంటి సంస్థలు మాత్రం గాలికొదిలేసి ఇప్పటికీ ఫీజులను చేస్తున్నాయి. ఇదే అసలు వివాదానికి కారణం.

వర్చ్యువల్ ప్రింట్ ఫీజు అంటే ఏమిటి :

డిజిటల్ ప్రొవైడర్లు ఎక్యూప్మెంట్ ఇన్స్టాలేషన్ కొరకు ఒక్కో థియేటర్ కు సుమారు రూ.40 – 60 లక్షల ఖర్చు చేశారు. ఆ మొత్తాన్ని వెనక్కి తెచ్చుకునేందుకు థియేటర్ల నుండి రోజుకు రూ. 22,500 లను వసూలు చేస్తున్నారు. రోజుకి రెండు షోలు వేసినా నాలుగు షోలు వేసినా ఇదే మొత్తాన్ని వసూలు చేస్తూ వస్తున్నారు ప్రొవైడర్లు. పైగా అన్ని ఏరియాలకు, చిన్న బడ్జెట్ సినిమాలకు ఇదే చార్జీలు వర్తించేవి. ఇదే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బందిగా మారింది. ఇటీవల జరిగిన సమావేశంలో పోవైడర్లు ఈ చార్జీలను రూ. 14,000లకు కుదిస్తామన్నారు కానీ అది కూడా నష్టాలనే మిగిల్చేలా ఉండటంతో నిర్మాతలు వ్యతిరేకించారు.

ఈ పద్దతిలో ఉన్న అసలు చిక్కేమిటి :

10 ఏళ్ల క్రితం ఎగ్జిబిటర్లు ఈ డిజిటల్ సిస్టమ్ కు సిద్ధంగా లేకపోయినప్పటికీ సిస్టమ్ ను ఉచితంగా అందిస్తామంటూ ఎగ్జిబిటర్లు వాళ్ళను ఒప్పించి ఈ పద్ధతిలోకి తీసుకొచ్చారు. అలాగే ఒప్పందంలో పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే వరకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడ తామే తీసుకుంటామని ప్రొవైడర్లు డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించారు. ఈ ఒప్పందం చేసుకుని దశాబ్దం గడుస్తున్నా, రద్దు చేయాల్సిన సమయం దాటిపోయినా ప్రొవైడర్లు ఏక పక్షంగా వ్యవహరిస్తూ అదే పద్దతిని ఫాలో అవుతూ అధిక మొత్తంలో చార్జీలను వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు ముఖ్యంగా చిన్న చిత్రాలను నిర్మించేవారికి తీరని నష్టాలు వాటిల్లుతున్నాయి. దీంతో దక్షిణాది నిర్మాతల మండలి ఈ పద్దతిని మార్చడానికి నిరసనకు పూనుకుంది.

 
Like us on Facebook