
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. వరుస హాస్యకథా చిత్రాలతో మెప్పిస్తూ, రాజేంద్ర ప్రసాద్ తర్వాత తెలుగులో ఆ స్థానాన్ని భర్తీ చేశాడు నరేష్. తాజాగా ఈ అల్లరోడు మూడు ముళ్ళ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు.
చెన్నైకి చెందిన విరూపతో నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో అల్లరి నరేష్ వివాహం వైభవంగా జరిగింది. ఈవీవీ సత్యనారాయణ ఇంట నరేష్ తరంలో చివరి పెళ్ళి కావడం చేత పెద్ద ఎత్తున వివాహ వేడుకను నిర్వహించారు. ఇక ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. పెళ్ళి వేదిక దగ్గర్నుంచీ అంతా వైభవంగా డిజైన్ చేసి అతిథులకు ఈ వేడుక గుర్తుండిపోయేలా నిర్వహించారు.

