మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్‌లోకి అల్లరి నరేష్.. ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ రిలీజ్!

మళ్లీ ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్‌లోకి అల్లరి నరేష్.. ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ రిలీజ్!

Published on Jun 30, 2026 10:52 AM IST

కామెడీ కింగ్ అల్లరి నరేష్ మళ్లీ తన అసలైన రూట్‌లోకి వచ్చేస్తున్నారు. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తూనే, ఈసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సరికొత్త ఫాంటసీ కామెడీతో సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న 65వ చిత్రానికి (Naresh65) ‘రంభ ఊర్వశి మేనక’ అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. నరేష్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ‘కామెడీ గోస్ కాస్మిక్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. పోస్టర్‌లో అల్లరి నరేష్ స్టైలిష్ లుక్‌లో స్వర్గపు మెట్లపై కూర్చొని కనిపించారు. చేతిలో పెన్ను, రంభ, ఊర్వశి, మేనక పేర్లు రాసి ఉన్న ఒక పత్రం (స్క్రోల్) పట్టుకుని ఉండగా.. మేఘాల మధ్య అప్సరసలు ఆయన చుట్టూ తిరుగుతున్నట్లు చూపించారు. దైవిక అంశాలతో కూడిన ఈ పోస్టర్ చూస్తుంటే, సినిమాలో వినోదం ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది. నరేష్ మార్క్ కామెడీకి తోడు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా తోడవడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

భారీ తారాగణం.. సెప్టెంబర్ 4న థియేటర్లలోకి

ఈ చిత్రంలో నరేష్‌తో పాటు వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లాంటి అగ్ర హాస్యనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో థియేటర్లలో నవ్వుల పండగే అని చెప్పొచ్చు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రంభ ఊర్వశి మేనక’ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు