
అల్లు అర్జున్.. తెలుగు సినీ ప్రేక్షకుడికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తన సరికొత్త స్టైల్, మ్యానరిజంతో తెలుగులో స్టార్ హీరోల్లో ఒకరుగా వెలుగొందుతోన్న బన్నీ, ఒక్కో సినిమాకూ ఒక్కో రకమైన కథలను ఎంపిక చేసుకుంటూ యాక్టింగ్ పరంగా తనను తాను ఎప్పటికప్పుడు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘రేసు గుర్రం’ ద్వారా తన స్థాయిని అమాంతం పెంచేసుకున్న బన్నీ తాజాగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ సత్తా చాటారు.
సౌతిండియాలోని సినీ పరిశ్రమలకు సంబంధించి ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డులను నిన్న సాయంత్రం ప్రకటించారు. నాలుగు భాషల సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో 2014లో విడుదలైన సినిమాల్లో వివిధ క్యాటగిరీల్లో టాప్ సినిమాలు పోటీలో నిలిచాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఉత్తమ నటుడు అవార్డును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. ‘రేసుగుర్రం’ సినిమాలో నటనకు గానూ ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక గతంలో అల్లు అర్జున్ ‘పరుగు’, ‘వేదం’ సినిమాలకు ఉత్తమ నటుడుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకోగా తాజాగా ‘రేసుగుర్రం’తో ముచ్చటగా మూడోసారి ఈ అవార్డును పొందిన హీరోల లిస్ట్‌లో చేరిపోయారు.
ఇక తనకు ఈ అవార్డు రావడం పట్ల బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. “రేసుగుర్రం చిత్రానికి పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అవార్డును ఇండియన్ సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకితం ఇస్తున్నా”నని తెలిపారు.