ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!

ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!

Published on Aug 17, 2026 11:03 PM IST

మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమీర్ లోగ్’ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఆగస్ట్ 21న తెలుగులో ఘనంగా విడుదల చేయబోతోంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో ముచ్చటించి చిత్ర విశేషాలను పంచుకున్నారు.

మీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పండి..?

నల్గొండ జిల్లా రాఘవపురంలో ఉండే నేను 1997లో ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి JNTUలో ఆర్కిటెక్చర్ పూర్తి చేశాను. ఆ సమయంలోనే నాకు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఆర్కిటెక్చర్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉన్న నేను, 2007లోనే సొంతంగా ఆఫీస్ ప్రారంభించాను. కరోనా సమయంలో సొంత ఊరికి వెళ్లినప్పుడు లభించిన ఖాళీ సమయంలో ఓటీటీలో విస్తృతంగా సినిమాలు చూశాను.

మొదటి సినీ ప్రయత్నం గురించి చెప్పండి?

మూడేళ్ల క్రితం ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. రాత్రికి రాత్రే రాసి షూటింగ్ చేస్తే 33 నిమిషాల ఫుటేజ్ వచ్చింది. కానీ అవుట్‌పుట్ నచ్చక, పక్కా బౌండెడ్ స్క్రిప్ట్‌తోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆ సమయంలో మనోజ్ బాజ్‌పేయి ఒక పాడ్‌కాస్ట్‌లో వాడిన ‘అమీర్ లోగ్’ అనే పదం నుంచే ఈ సినిమా ప్రయాణం మొదలైంది.

‘అమీర్ లోగ్’ జర్నీ గురించి చెప్పండి?

ముందుగా ‘అమీర్ లోగ్’ అనే టైటిల్ అనుకుని, ఆ తర్వాత అసలైన అమీర్ లోగ్ ఎవరు అనే ఆలోచనతో కథ రాయడం మొదలుపెట్టాను. ఒక బస్తీ, ముగ్గురు కుర్రాళ్ల నేపథ్యంతో హైదరాబాద్ బస్తీ వాతావరణాన్ని తెరపై అద్భుతంగా చూపించాలని ప్లాన్ చేశాను. రెండేళ్ల క్రితమే స్క్రిప్ట్ పూర్తి చేసి, అందరి సలహాలతో పక్కాగా సిద్ధం చేశాక డెమో షూట్ చేసి పలువురికి చూపించాం..

ఎన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు?

మా సినిమా షూటింగ్ దాదాపు బస్తీలోనే సాగింది. డెమోతో కలిపి మొత్తం 43 రోజులు కాగా, ఒక్క బస్తీలోనే 38 రోజుల పాటు షూట్ చేశాం. ముఖ్యంగా నైట్ షూటింగ్స్ వల్ల బస్తీ ప్రజలకు కాస్త ఇబ్బంది కలిగినా వారు ఎంతో సహకరించారు.

రానా గారు, ఆయన టీం తీసుకుంటున్న జాగ్రత్తలు, ఇచ్చిన సలహాలు ఏంటి?

మా సినిమాను స్పిరిట్ మీడియా టీమ్‌కి చూపించినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసే బాగుందన్నారు. సెకండాఫ్‌కి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి రానా గారి టీమ్ ఎంతో సంతోషించింది. ఆయన మనకు అందిస్తున్న సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మా మూవీ గురించి రానా గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, త్వరలోనే ఆయన సినిమా కూడా చూడనున్నారు.

‘అమీర్ లోగ్’ మ్యూజిక్ గురించి చెప్పండి?

సంగీత దర్శకుడు స్మరణ్‌ను మేము కేవలం ఒక దావత్ సాంగ్ మాత్రమే అడిగాం. కానీ ఆయన సినిమా చూసి ఎక్కడెక్కడ పాటలు ఉంటే బాగుంటుందో సజెషన్స్ ఇస్తూ ఏకంగా 10 అద్భుతమైన పాటలు అందించారు. లిరిసిస్టులు మనోజ్, నిఖిలేష్ మంచి సాహిత్యాన్ని రాశారు. ముఖ్యంగా కీరవాణి గారు పాడిన పాట దశాబ్దాల పాటు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది.

సెన్సార్ నుంచి వచ్చిన రిపోర్ట్ గురించి చెప్పండి?
సెన్సార్ బోర్డు కేవలం నాలుగైదు చోట్ల మ్యూట్ చేయమని చెప్పిందంతే. ఇందులో ప్రతీ పాత్ర ఎంతో కీలకమైనది, ప్రతి ఒక్కరి కోణంలోంచీ కథ సాగుతుంది. నటులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో వారు సెట్స్‌లో డైలాగ్స్‌ను మరింత అద్భుతంగా ఇంప్రవైజ్ చేశారు. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు