ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో బాలనటుడిగా మంచి ప్రతిభ కనబరిచాడు. ‘ధోని’ సినిమా ద్వారా ప్రధాన పాత్రలోనూ మెప్పించిన ఆకాష్, తాజాగా ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆంధ్రాపోరి’ అనే టీనేజ్ లవ్‌స్టోరీ ద్వారా పూర్తి స్థాయి హీరోగా పరిచయం కానున్నాడు. ఇక ఈ సినిమాకు ‘ఆంధ్రాపోరి’ అనే టైటిల్ అనౌన్స్ చేసిన మరుక్షణం నుండి సినిమాపై కొందరు ఆంధ్రా ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.
తాజాగా ఆంధ్రా సెటిలర్స్ ఫోరమ్ ప్రతినిధులు వేసిన ఓ పిటిషన్ హైకోర్టు ముందుకు వచ్చింది. ‘ఆంధ్రాపోరి’ అనే టైటిల్ ద్వారా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని వారు వేసిన పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ విషయంలో ‘ఆంధ్రాపోరి’ టీమ్ మొదట్నుంచే సరైన క్లారిటీ ఇస్తూ వస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ చదువుకోని అబ్బాయి తన ప్రేయసి అయిన ఆంధ్రా అమ్మాయిని ముద్దుగా ‘ఆంధ్రాపోరి’ అని పిలుచుకుంటాడని, వేరే ఇతర ఉద్దేశాలు ఆపాదించే అవసరం తమకు లేదని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది. ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు రేపు కోర్టులో ఎలాంటి ఫలితం రానుందనేది ఆసక్తికరంగా మారింది.


