వినాయక చవితి సందర్భంగా “ధర్మవరం” సినిమా పోస్టర్ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. హీరోగా, కథాకథన రచయితగా, దర్శకుడిగా రాజ్ వేంకటాచ్ఛ ఈ చిత్రానికి బహుముఖ ప్రతిభను సమర్పిస్తున్నారు.
కథానాయకుడిగా మెప్పించిన రాజ్ వేంకటాచ్ఛ, దర్శకుడిగా కూడా తన ప్రత్యేక ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అజయ్, నవీన్ రెడ్డి, సంయోగీత, ఏశాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, గ్రామీణ సాంప్రదాయాలు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ కథనం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ధర్మవరం పోస్టర్ చాలా బాగుంది. కొత్తదనం కనిపిస్తోంది. హీరోగా, దర్శకుడిగా రాజ్ వేంకటాచ్ఛ చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని పేర్కొన్నారు.
దర్శకుడు రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ “ధర్మవరం నాకు హృదయానికి దగ్గరైన ప్రాజెక్ట్. వినాయక చవితి పర్వదినాన పోస్టర్ విడుదల కావడం మాకెంతో శుభసూచకమైంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉంటే ఈ చిత్రం విజయవంతం అవడం ఖాయం” అన్నారు.
త్వరలోనే “ధర్మవరం” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
