దేవుడితోనే పోరాడబోతున్న ‘ఏఎన్నార్ మనవడు’ !

Published on Jul 1, 2018 1:46 pm IST

హీరో సుమంత్ కథానాయకుడిగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్ సరసన ఈషా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ‘మళ్ళీ రావా’ లాంటి భావోద్వేగమైన ప్రేమకథతో సుమంత్ మంచి విజయాన్ని అందుకున్నారు. కాగా ‘సుబ్రహ్మణ్యపురం’ సుమంత్ కి 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని టారస్ సినీకార్పు మరియు సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐతే చిత్ర నిర్మాతలలో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్రబృందం విడుదల చేసింది.

కాగా ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందట. దయ్యానికి కోపం వస్తే దేవుడ్ని ఆశ్రయించవచ్చు. మరి దేవుడికే కోపం వస్తే పరిస్థితి ఏంటి ? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుడితో పోరాడాల్సి వస్తుంది. ఎలా పోరాడాడు ఎందుకు పోరాడాడు అనే ఆసక్తికరమైన థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆగష్టులో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తవ్వనుంది. ఈ చిత్రానికి ఆర్కే ప్రతాప్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :