హైదరాబాద్ వైద్య రంగానికి మరో మణిమకుటం తోడైంది. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ హెల్త్‌కేర్ సదుపాయాలతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో తమ సరికొత్త ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది. ఇది దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్‌నకు 76వ ఆసుపత్రి కాగా, తెలంగాణలో ఐదోది. 400 పడకల సామర్థ్యంతో పది అంతస్తుల్లో నిర్మించిన ఈ అత్యాధునిక స్మార్ట్ ఆసుపత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి, శోభనా కామినేని, డాక్టర్ సంగీతారెడ్డి, ఉపాసన కామినేని కొణిదెల పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చే పేషెంట్లకు మెరుగైన ప్రయాణ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. సామాన్యులకు సైతం నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి కృషిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ప్రతి ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు
వ్యాధి వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే, ముందస్తు జాగ్రత్తలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యమని అపోలో యాజమాన్యం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. నానక్‌రామ్‌గూడలో నివసిస్తున్న 10 వేల మందికి ప్రతి ఆదివారం ఉచితంగా హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జబ్బులను తొలిదశలోనే గుర్తించడం ద్వారా ఆసుపత్రిలో చేరే పరిస్థితులను నివారించవచ్చని ఆయన చెప్పారు. ఇక గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ వైద్యరంగంలో అపోలో కీలక పాత్ర పోషిస్తోందని, ఏఐ ఆధారిత టెక్నాలజీతో రోగులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నామని డాక్టర్ సంగీతా రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాసన కామినేని కొణిదెల పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది తనకు ఎంతో అండగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. అపోలో వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన అత్త సంగీతారెడ్డి నిరంతరం స్ఫూర్తినిస్తూ, మార్గనిర్దేశం చేస్తున్నారని ఉపాసన చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా ఈ కొత్త ఆసుపత్రి సేవలు అందిస్తుందని అపోలో ప్రతినిధులు వెల్లడించారు.


