ప్రీమియం ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను ఇష్టపడేవారికి యాపిల్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2’ (AirPods Max 2)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2020లో వచ్చిన తొలి తరం మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ కొత్త హెడ్‌ఫోన్స్, డిజైన్‌లో పాత మోడల్‌నే పోలి ఉన్నా.. టెక్నికల్‌గా ఎన్నో కొత్త ఫీచర్లను పరిచయం చేశాయి. ముఖ్యంగా కొత్త H2 చిప్‌ను వాడటంతో ఆడియో క్వాలిటీ అమాంతం పెరిగింది.
సరికొత్త ఫీచర్లు.. ఆకట్టుకునే మార్పులు
గత మోడల్‌లో ఉన్న H1 చిప్ స్థానంలో పవర్‌ఫుల్ H2 చిప్‌ను యాపిల్ ఇందులో అమర్చింది. దీనివల్ల యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మునుపటి కంటే 1.5 రెట్లు మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే మొదటి మోడల్‌లో లేని ‘అడాప్టివ్ ఆడియో’, ‘కన్వర్జేషన్ అవేర్‌నెస్’, ‘లైవ్ ట్రాన్స్‌లేషన్’, ‘వాయిస్ ఐసోలేషన్’ లాంటి స్మార్ట్ ఫీచర్లను యాపిల్ ఈ సరికొత్త డివైజ్‌లో అందించింది. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా వాల్యూమ్ తగ్గడం ఈ కన్వర్జేషన్ అవేర్‌నెస్ ప్రత్యేకత.
అలాగే డిజిటల్ క్రౌన్‌కు యాపిల్ ఓ కొత్త డ్యూటీ ఇచ్చింది. దీన్ని ఉపయోగించి స్మార్ట్‌ఫోన్ కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. అంటే దూరం నుంచి ఫోటోలు తీయాలన్నా, వీడియో రికార్డింగ్ ఆన్ చేయాలన్నా ఈ హెడ్‌ఫోన్స్‌లోని క్రౌన్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఇక సిరి (Siri) కోసం మనం వాయిస్ కమాండ్స్ ఇవ్వాల్సిన పనిలేదు. కేవలం తల ఊపుతూ ఇచ్చే జెస్చర్స్ ద్వారా కూడా కాల్స్ ఆన్సర్ చేయడం, రిజెక్ట్ చేయడం లాంటివి చేయవచ్చు. ఛార్జింగ్ కోసం పాత లైట్నింగ్ పోర్ట్‌ను తీసేసి, టైప్-సీ (USB-C) పోర్ట్‌ను తీసుకురావడం యూజర్లకు బాగా కలిసొచ్చే అంశం. ఈ కేబుల్ ద్వారా 24-బిట్ లాస్‌లెస్ ఆడియోను ఎంజాయ్ చేయవచ్చు.
ధర, లభ్యత వివరాలు
ఇండియాలో యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ 2 ధరను రూ.67,900గా నిర్ణయించారు. మునుపటి మోడల్ లాంచ్ ధర (రూ.59,900)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. మిడ్‌నైట్, స్టార్‌లైట్, ఆరెంజ్, పర్పుల్, బ్లూ రంగుల్లో ఈ హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉంటాయి. మార్చి 25 నుంచి ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి కస్టమర్లకు డెలివరీలు అందిస్తామని యాపిల్ స్పష్టం చేసింది. బ్యాటరీ విషయంలో మాత్రం పెద్దగా మార్పుల్లేవు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 20 గంటల పాటు నిరంతరాయంగా పాటలు వినొచ్చు.


