తెలుగు అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన ‘ధృవ’ విలన్!

arvind-swamy
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. కరన్సీ బ్యాన్ ప్రభావం వల్ల అనుకున్నంత స్థాయిలో ఓపెనింగ్స్ రాకున్నా, రోజురోజుకీ బాక్సాఫీస్ వద్ద ధృవ జోరు పెరుగుతూ వస్తోంది. ఇక ఈ సక్సెస్‌తో చరణ్ సహా టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా నాటితరం హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి ధృవ విజయం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో రోజా, బొంబాయి లాంటి క్లాసిక్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న ఆయన, చాలా ఏళ్ళ తర్వాత విలన్‌గా వచ్చి మెప్పించారు.

సిద్ధార్థ్ అభిమన్యు అన్న నెగటివ్ రోల్‌లో అరవింద్ స్వామి నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ధృవకు మాతృక అయిన తమిళ సినిమా తని ఒరువన్‌లోనూ అరవింద్ స్వామియే విలన్‌గా నటించారు. “నన్ను మళ్ళీ ఇంత బాగా ఆదరిస్తోన్నందుకు, సినిమాకు ఇంత పెద్ద విజయం తెచ్చిపెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్” అని అరవింద్ స్వామి తెలిపారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.