
సినిమా సినిమాకూ కొత్తదనాన్ని చూపిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరో నారా రోహిత్. తాజాగా ఆయన మరో వైవిధ్యభరితమైన ప్రయత్నం ‘అసుర’తో మన ముందుకొచ్చిన విషయం తెలిసిందే! గత కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలన్నీ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాక, సరికొత్త కథాంశాలుగా తెరకెక్కిన సినిమాలుగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే కమర్షియల్‌గా ఆ సినిమాలేవీ అనుకున్నంత కమర్షియల్ విజయాలుగా నిలవలేకపోయాయ్!
కాగా అసుర మాత్రం నారా రోహిత్ స్టైల్లోనే సాగే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, కమర్షియల్‌గానూ ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందనే చెప్పాలి. నారా రోహిత్ కెరీర్లోనే ఎక్కువ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా ఈ వారం ముగిసేకల్లా లాభాల బాట పట్టనుందని ట్రేడ్ టాక్. సాటిలైట్ హక్కులు కూడా మంచి మార్కెట్ జరుగుతూండడం విశేషం! సినిమాను ప్రేక్షకుల వద్దకు మరింతగా తీసుకెళ్ళడానికి రోహిత్ సక్సెస్ టూర్‌ను ప్లాన్ చేస్తున్నారు. కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్‌గా నటించింది.

