ఆ సమయంలో బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకున్నారు – తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

Published on Mar 14, 2023 11:43 pm IST


నటుడు నందమూరి తారకరత్న ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. అంతకముందు నారాలోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న, ఆ తరువాత కొన్నాళ్ల చికిత్స అనంతరం ఆరోగ్యం విషమించడంతో మరణించారు. అయితే తారకరత్నకి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ సమయంలో ఆయనతో పాటు ఉండి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు నందమూరి బాలకృష్ణ. ఇక తాజాగా ఒక అభిమాని ఎడిట్ చేసిన ఫోటోని చూసి అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకుంటూ తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసారు.

మేము కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. తారకరత్న ఆసుపత్రిలో ఉన్న సమయంలో తోడు నీడగా ఉండడంతో పాటు తల్లిలా లాలి పాటలు పాడారు, అలానే తారకరత్న ప్రతిస్పందించాలని ప్రయత్నిస్తూ జోకులు కూడా వేశారు. పలు సందర్భాల్లో ఎవరూ చూడనపుడు తనకోసం కన్నీరుమున్నీరయ్యారు అంటూ ఆమె పోస్ట్ లో తెలిపారు. ఈ ఫోటోని ఎవరు ఎడిట్ చేసారో తెలియదు కాని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తారకరత్న పిల్లలతో బాలకృష్ణ కలిసి దిగిన ఫోటోని ఆమె షేర్ చేసారు. కాగా ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :