ప్రేక్షకుల మారుతున్న అభిరుచికి అనుగుణంగా, సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆత్రేయపురం బ్రదర్స్’. రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.
ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వశిష్ట క్లాప్ నివ్వగా, విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకులు ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్‌ను యూనిట్‌కు అందజేశారు. మరో దర్శకుడు అనుదీప్ కేవీ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, రఘు బాబు, గవిరెడ్డి, సన్నీ పత్సా, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘ఏ స్వీట్ రైవల్రీ’ (A Sweet Rivalry) అనే ట్యాగ్‌లైన్‌తో, ఇద్దరు వ్యక్తుల మధ్య బలపరీక్షను సూచిస్తూ డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాలో వైవిధ్యాన్ని చాటుతోంది. వీఎస్‌కే సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె, రాకేష్ గద్దె సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమీజ్ నవనీత్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, సంతు ఓంకార్ సంగీతం సమకూరుస్తున్నారు.



