మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ (Avengers: Doomsday) రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ మూవీ, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే రికార్డుల వేట మొదలుపెట్టింది.
ట్రైలర్ విడుదలైన వెంటనే మేకర్స్ అడ్వాన్స్ సేల్స్ ప్రారంభించగా.. కేవలం 12 గంటల్లోనే ఏకంగా 10.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 87 కోట్లు) విలువైన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇక్కడ విచిత్రమేమిటంటే.. డిస్నీ కొత్తగా తీసుకొచ్చిన ‘ఇన్ఫినిటీ విజన్’ (Infinity Vision) అనే ప్రీమియం లార్జ్-స్క్రీన్ ఫార్మాట్‌లో మాత్రమే ప్రస్తుతం టికెట్లను అందుబాటులో ఉంచారు. అమెరికాలోని మొత్తం స్క్రీన్లలో కేవలం 10 శాతం థియేటర్లలోనే బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ, ఈ రేంజ్‌లో వసూళ్లు రావడం చూసి ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి.
ఈ సినిమాపై ఈ స్థాయిలో హైప్ రావడానికి ప్రధాన కారణం రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr.) గ్రాండ్ రీ-ఎంట్రీనే! దశాబ్దానికి పైగా ‘ఐరన్ మ్యాన్’గా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన, ఈసారి ఐకానిక్ విలన్ ‘డాక్టర్ డూమ్’ (Doctor Doom) అవతారంలో మెప్పించనున్నారు.
‘అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ వంటి ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్లను అందించిన రుస్సో బ్రదర్స్ (ఆంథోనీ, జో రుస్సో) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ మల్టీస్టారర్‌లో క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, ఆంథోనీ మాకీ, పాల్ రుడ్ వంటి దిగ్గజ తారలు భాగమయ్యారు. ప్రచార చిత్రాలతోనే పూనకాలు తెప్పిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 18న థియేటర్లలో అడుగుపెట్టిన తర్వాత ఇంకెన్ని ప్రపంచ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.


