సమీక్ష : ‘ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్’ – విజువల్ ట్రీట్ !

Avengers Endgame movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 26, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5

నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, జోష్ బ్రోలిన్, క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌

దర్శకత్వం : ఆంథోనీ రుస్సో, జో రుస్సో

నిర్మాత : కెవిన్ ఫీగే మరియు స్టాన్ లీ

సంగీతం : అలాన్ సిల్వెస్ట్రీ

సినిమాటోగ్రఫర్ : ట్రెంట్ ఓపాలోచ్

ఎడిటర్ : జెఫ్రీ ఫోర్డ్

ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న మార్వెల్స్ ఎవెంజర్స్ సిరీస్ కు ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా ఈ సిరీస్ నుండి తాజాగా ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలయింది. భారత్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రం మార్వెల్‌ స్టూడియోస్‌ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. మరి ఈ డబ్బింగ్ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

భూమి మీద ఏభై శాతం జనాన్ని థానోస్‌ సర్వ నాశనం చేసాక.. ఆ ప్రభావంతో ఎవెంజర్స్ తమ వాళ్ళను కోల్పోయి ఎవరికి వారుగా విడిపోతారు. అప్పటికే ఎవెంజర్స్ లో కొందరు తమ శక్తిని నైపుణ్యాన్ని కూడా వదిలేసి భాధతో జ్ఞాపకాలతో తమ జీవితాన్ని గడుపుతుంటారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎవెంజర్స్ అందరూ మళ్లీ కలిసి, చనిపోయిన తమ వాళ్ళను బతికించుకోవాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం కాల గమనాన్ని శాసించే శక్తివంతమైన ఆరు మణులును సాధించాలనుకుంటారు. మరి ఎవెంజర్స్ అందరూ ఆ మణులును సాధించారా ? తిరిగి తమ వాళ్ళను బతికించుకున్నారా ? ఈ క్రమంలో థానోస్‌ నుంచి వారికీ ఎలాంటి అవాంతరాలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ క్రమంలో ఎవెంజర్స్ లో ఎవరెవరూ ప్రాణ త్యాగం చేస్తారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఎవెంజర్స్ సిరీస్ అంటేనే సూపర్ హీరోల యాక్షన్స్ మరియు ఎమోషన్స్ తో నిండిపోయిఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఈ ఎండ్ గేమ్ లో కూడా సూపర్ హీరోలందరూ తమ ధైర్యసాహసాలతో ఫైట్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే బలమైన విలన్‌‌ ను ఎదురుకునే క్రమంలో వచ్చే
అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో విలన్ వర్గం పై దాడి చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

అలాగే మణులను సాధించే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్‌ గా నిలుస్తాయి. విలన్ థానోస్ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్ర తాలూకు మేకప్ మరియు ఆ పాత్రకు తగ్గట్లు రానా చెప్పిన డైలాగ్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్‌ గా సరిపోయాయి. మెయిన్ గా సూపర్ హీరోస్ కన్నా ఎన్నో రెట్లు బలమైన థానోస్ పాత్ర.. సినిమాను ఉత్కంఠభరితంగా మార్చింది.

అలాంటి థానోస్ ను అంతం చెయ్యటానికి చివర్లో ఎవెంజర్స్ అందరూ ఒకేసారి అటాక్ చేసే సన్నివేశం కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేపిస్తోంది. అలాగే డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు సినిమాల పేర్లను వాడటం వల్లన తెలుగు నేటివిటీకి సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేశారు.

ఇక అవెంజర్స్‌ ఐరన్ మ్యాన్, హల్క్, థోర్ ఇలా ప్రతి ఒక్క సూపర్ హీరో ప్రేక్షకులను అలరించడంలో తమ పాత్ర పరిధి మేరకు చాలా బాగా మెప్పించారు.
అలాగే సూపర్ హీరోల పాత్రలను పరిచయం చేసే సీన్స్ కూడా బాగున్నాయి. ఇక ఆ ఆసక్తికరమైన పాత్రల్లో నటించిన స్టార్ నటీ నటులు తమ నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఈ ఎండ్ గేమ్ లో ఎమోషన్, ప్రేమ వంటి అంశాలు కూడా బాగున్నాయి. ప్రధానంగా టోనీ స్టార్క్ చనిపోయిన విధానం చాలా ఎమోషనల్ అనిపిస్తోంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకులు ఆంథోనీ, జో రుస్సో ఎవెంజర్స్ లో సూపర్ హీరోల పరిచయంతో ఫస్టాఫ్ ను ఆసక్తికరంగా కాస్త ఎమోషనల్ గా మొదలుపెట్టినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ఇక మొదటి నుండి ఈ ఎవెంజర్స్ సిరీస్ ను ఫాలో అయ్యేవారికి తప్ప కొత్తగా ఈ భాగాన్ని చూసేవారికి సినిమా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది.

పైగా ఈ భాగం ఎమోషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన యాక్షన్ పార్ట్ తగ్గింది. దాంతో యాక్షన్ పార్ట్ కోసం వచ్చే ప్రేక్షకులకు ది ఎండ్ గేమ్ కొంతవరకు అసంతృప్తిని మిగులుస్తోంది. ఇక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో క్లైమాక్స్ జరిగాక సినిమాని ముగిస్తే బాగుండేది. కానీ ప్రతి క్యారెక్టర్ తాలూకు ఎండింగ్ ను చూపించారు. అయితే ఆ ఎండింగ్ సీన్స్ బాగా నెమ్మదిగా సాగడం బోర్ గా అనిపిస్తోంది.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమా సాంకేత చరిత్రలోనే ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా వుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్, కంప్యూర్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.

తీర్పు :

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నెలకొన్న ఎవెంజర్స్ సిరీస్ లో.. యావత్తు ప్రేక్షక లోకం ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్ (డబ్బింగ్ ) మొత్తానికి అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ తో యాక్షన్ సీక్వెన్స్ తో మరియు బలమైన ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, ఎవెంజర్స్ సిరీస్ ఫాలో అవ్వని వారికి ఈ భాగం కొంత కన్ఫ్యూజన్ గా అనిపించడం వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి. కానీ సినిమాలో కంటెంట్ తో పాటు స్పెషల్ ఎఫెక్ట్స్ బాగా అలరిస్తాయి. మొత్తానికి ‘ది ఎండ్ గేమ్’ ఎవెంజర్స్ సిరీస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి ట్రీట్ లా అనిపిస్తోంది.

123telugu.com Rating : 3.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :