
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మికంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ సృష్టిస్తోన్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషల్లో ఏకకాలంలో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాక, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఈ సినిమాను పలువురు ప్రశంసిస్తున్నారు. ఒక్క సినీ ప్రముఖుల నుంచే కాక, క్రీడా, రాజకీయ, వ్యాపారవర్గాల నుంచి కూడా బాహుబలికి కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్ రావడం విశేషం.
ఇక కేవలం ఇండియాలోనే కాక అమెరికాలోనూ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలిపై అక్కడి ప్రఖ్యాత ఆన్‌లైన్ పత్రికలు కొన్ని ఆసక్తికర కథనాలను ప్రచురించడం గురించి ఇంతకుముందే తెలియజేశాం. అమెరికాలో పేరొందిన పత్రికలైన ది గార్డియన్, హాలీవుడ్ రిపోర్టర్, వెరైటీ, న్యూయార్క్ టైమ్స్‌లతో పాటు ఇండియాలోనూ అందరికీ పరిచయమైన ఫోర్బ్స్ పత్రిక కూడా బాహుబలిపై ఓ కథనం అందించింది. ఆ ఆన్‌లైన్ పత్రిక అందించిన కథనం ఆ వెబ్‌సైట్‌లో ఎక్కువమంది చదివిన కథనాల్లో ఒకటిగా ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఏంటన్నది మరోసారి ఋజువైంది.
ఇండియాలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన బాహుబలి, అద్భుతమైన విజువల్స్‌తో, ఆర్ట్ వర్క్స్‌తో ఆకట్టుకుందని, రాజమౌళి విజన్ ప్రస్తావించదగ్గ విషయమని చెబుతూ ఈ మ్యాగజైన్లు బాహుబలిపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇక బాక్సాఫీస్ పరంగా బాహుబలి ఇండియన్ సినిమాకు ఓ కొత్త దారిని చూపాయని ఫోర్బ్స్ పత్రిక ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని తెలిపింది.