మహిష్మతి.. ఈ పేరు మరో రెండు నెలల్లో అందరికీ సుపరిచితం అయిపోయే పేరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ పేరు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న బాహుబలి సినిమాలోని రాజ్యం పేరు. రాజమౌళి ఊహల్లో రూపొందిన ఈ రాజ్యానికి బాహూబలి టీం రెండేళ్ళుగా కష్టపడి రూపు, అందాన్ని తీసుకొచ్చింది. కళ్ళు చెదిరిపోయే సెట్స్‌తో రాజమౌళీ రాజ్యాన్ని ఆవిష్కరించారు కళా దర్శకులు శిబూ సిరిల్. రాజమౌళి ఆలోచనలు ఊహకందవనీ, తాను రెండేళ్ళ పాటు వేరే ఇతర సినిమాలకు పనిచేయకుండా కేవలం బాహుబలిపైనే నిమగ్నమయ్యానంటే బాహుబలి ఎంతగా నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘బాహుబలి’ విషయంలో అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ సినిమాగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఫైట్స్ అన్నీ భారీ ఎత్తున తలపెట్టి విజువల్ వండర్‌గా సినిమాను తయారుచేస్తున్నారు రాజమౌళి.
ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించబడుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెలాఖర్లోనే ఆడియో ఆవిష్కరణను చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మే 15న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్న విషయం తెలిసిందే.


