
‘బాహుబలి’ అంటేనే సినీ పరిశ్రమలో ఓ సంచలనం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సంచలనం విడుదల తర్వాత కూడా అదే సంచనాలను సృష్టిస్తూ కలెక్షన్లలో మొదటిరోజు దేశవ్యాప్తంగా ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. బాలీవుడ్ స్టార్ హీరోలైన ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో పాటు తమిళ సూపర్ స్టార్ అయిన రజనీ కాంత్‌కు కూడా సాధ్యపడని రికార్డు సృష్టించి దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ తన సత్తా ఏంటో చూపింది.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే! గత కొన్ని దశాబ్దాల కాలంలో ఈ స్థాయి అంచనాల మధ్య వేరే ఏ ఇతర సినిమా విడుదల కాని నేపథ్యంలో ‘బాహుబలి’ సినిమాను మొదటి రోజే చూసేయాలన్న ఆతృతలో ప్రతీ సినీ అభిమానీ ఎదురుచూశారు. ఈ క్రమంలోనే మొదటిరోజు ఈ సినిమాకు కనీవినీ ఎరుగని రీతిలో ఓపెనింగ్స్ వచ్చాయి.
అన్ని వర్షన్‌లు కలుపుకొని బాహుబలి సినిమా మొదటిరోజు దేశవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు వసూలు చేసి వండర్ అనిపించుకుంది. ఇందులో ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 24 కోట్ల రూపాయాలు రావడం విశేషం. ఇక హిందీలో ఈ సినిమా మొదటిరోజు సుమారు 5.15కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓ డబ్బింగ్ సినిమా (హిందీలో) ఈ స్థాయి కలెక్షన్లను సాధించడం విశేషమే! ‘బాహుబలి’ సినిమాలోని గ్రాఫిక్స్, సెట్టింగ్‌లు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, రాజమౌళి విజన్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ చూడనటువంటి గ్రాఫిక్స్‌తో ఈ సినిమా థ్రిల్ చేయడంతో బాహుబలిని దేశవ్యాప్తంగా విజువల్ వండర్‌గా ప్రశంసిస్తున్నారు.

