
జూలై 10 2015.. దర్శకుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టాత్మక సినిమా ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఇక ఆ రోజు నుంచి మొదలుకొని నేటివరకూ విడుదలైన అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ దూసుకెళుతోందీ సినిమా. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సంచలనాలు నమోదు చేసిన ఈ సినిమా, చెన్నై నగరంలో స్ట్రైట్ తమిళ సినిమాలను కూడా దాటేసి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
కాగా ఈమధ్యే యాభై రోజులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా అదే ఊపును కొనసాగిస్తూ చెన్నై సిటీలో సత్తా చాటుతోంది. ఇప్పటికీ పలు ప్రధాన మల్టీప్లెక్స్‌లలో బాహుబలి సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. ఇప్పటివరకూ 8 కోట్ల రూపాయలకు పైనే గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బ్లాక్ బస్టర్ కత్తి సినిమా కలెక్షన్స్‌ని కూడాబాహుబలి బ్రేక్ చేయడం ప్రస్తుతం ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం. ఒక తెలుగు సినిమా తమిళ నాట ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం అద్భుతమనే చెప్పాలి.

