చైనాలో ‘బాహుబలి’ రిలీజ్‌కు భారీ ప్లాన్స్!

చైనాలో ‘బాహుబలి’ రిలీజ్‌కు భారీ ప్లాన్స్!

Published on Sep 25, 2015 1:31 PM IST

Baahubali
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా ఇంటర్నేషనల్ ప్రేక్షకులను కూడా అలరించేందుకు ‘ఇంటర్నేషనల్ కట్’తో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించి, ఆ ప్రదర్శనతో వచ్చే క్రేజ్‌తో సినిమాను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఉన్నారు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’కి ఓ ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించే ఆలోచన చేశారు. ఆ క్రమంలోనే ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్‌తో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌ను ఎడిట్ చేయించారు. ఇక ఫిల్మ్ ఫెస్టివల్స్‌ ప్రదర్శన అలా ఉంచితే.. ఇంటర్నేషనల్ వర్షన్ థియేట్రికల్ రిలీజ్ మొదటగా చైనాలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టార్స్ ఫిలిమ్స్ అనే సంస్థ బాహుబలి సినిమా చైనా రిలీజ్ హక్కులను సొంతం చేసుకుంది.

బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌తో చాలా హ్యాపీగా ఉన్న రాజమౌళి, చైనాలో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. నవంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం కోసం ఈ స్టార్ ఫిలిమ్స్ ప్లాన్ చేస్తోంది. సుమారు 5000 థియేటర్లలో భారీ ఎత్తున ఈ సినిమాను చైనాలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే చైనాలో ఆమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అదే కోవలో బాహుబలి కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు