హిందీలో 50 కోట్ల క్లబ్‌లో చేరిన ‘బాహుబలి’!

baahubali-b
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా అన్ని చోట్లా రికార్డులను తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున జూలై 10న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని చోట్ల నుంచీ అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డు సృష్టిస్తోంది. హిందీలో డబ్బింగ్ సినిమాలనేవీ పెద్దగా ఆడవు అనే నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా హిందీలోనూ సత్తా చాటింది. ఇప్పటివరకూ ఏ డబ్బింగ్ సినిమాకూ సాధ్యపడని రికార్డులను సొంతం చేసుకుంటూ రెండో వారం కూడా దూసుకుపోతోంది.

హిందీలో ఈ సినిమా మొదటి వారం కనీవినీ ఎరుగని రేంజ్‌లో, డబ్బింగ్ సినిమా ఎప్పుడూ సాధ్యపడని రికార్డులతో 46.77 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో వారం కూడా ఈ సినిమా స్టడీగానే కొనసాగుతుండడం విశేషం. రెండో శుక్రవారం ఈ సినిమా 3.25కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. దీంతో నిన్నటితో ఈ సినిమా 50 కోట్ల మార్క్ టచ్ చేసి ఘనత చాటింది. గురువారం కలెక్షన్లతో (6.12కోట్లు) పోల్చితే శుక్రవారం వచ్చింది తక్కువే అయినా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ రోజు బాహుబలి సినిమాకు ఈ కలెక్షన్లు రావడం నిజంగా విశేషమే!

బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టుల ప్రకారం సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘భజరంగీ భైజాన్’ రాకతో బాహుబలి కలెక్షన్లు పూర్తిగా పడిపోతాయని అంచనాలు వ్యక్తం కాగా, బాహుబలి రెండో శుక్రవారం కూడా మంచి కలెక్షన్లను సాధించి స్టడీగా నిలబడింది. ఇప్పటివరకూ బాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాల విషయంలో రోబో (18కోట్లు) ఒక్కటే సత్తా చాటగా, బాహుబలి దానికి రెట్టింపు కలెక్షన్లను కొల్లగొడుతూ చరిత్ర సృష్టిస్తోంది.

Exit mobile version