‘బాహుబలి’ విషయంలో రాజమౌళి ఎంత నమ్మకంగా ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆయన మాటలను బట్టి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్, బలమైన భావోద్వేగంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందన్న నమ్మకాన్ని రాజమౌళి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రచార కార్యక్రమాలను అన్ని చోట్లా వేగవంతం చేశారు.
ఇప్పటికే బాలీవుడ్‌లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రచారాన్ని మొదలుపెట్టగా, తమిళంలో ఆడియో రిలీజ్‌తో ప్రమోషన్ మొదలుకానుంది. ఇక తెలుగులో గత మూడు నెలలనుంచి సోషల్ మీడియాలో బాహుబలి హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే! తాజాగా రాజమౌళి సాంప్రదాయ మీడియా ప్రచారాలను కూడా మొదలుపెట్టేశారు.
ఈ సందర్భంగా ఓ ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ, “బాహుబలి అంటే కేవలం భారీ యుద్ధాలు, పెద్ద పెద్ద సెట్లు మాత్రమే కాదు. బాహుబలి అంటే బలమైన భావోద్వేగాలతో కూడిన సినిమా. థియేటర్లలో ప్రేక్షకుడిని ఆ భావోద్వేగంతోనే కట్టిపడేస్తానన్న నమ్మకముంది” అంటూ రాజమౌళి తెలిపారు. ఇక బాహుబలి ఆడియో ఫంక్షన్‌లో ఏకంగా “నావరకు నేనో క్లాసిక్ తీశాననే అనుకుంటున్నా!” అనడం రాజమౌళికి తన సినిమాపై ఉన్న ధీమాగా చెప్పొచ్చు. ఏ దర్శకుడైనా ఓ సినిమాను ముందే క్లాసిక్ తీశాననేంత ధీమాగా తెలుపుతున్నాడంటే అందులో కచ్చితంగా బలమైన విషయం ఉండే ఉంటుంది. మరి బాహుబలిలో ఆ బలమైన అంశమేమిటి? అన్నది తెలియాలంటే జూలై 10వరకూ ఆగాల్సిందే!


