
దర్శకుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ సినిమా విడుదలైన అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మళయాలం ఇలా అన్ని భాషల్లో జూలై 10న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా మూడో వారం కూడా అదే ఊపుతో దూసుకుపోతోంది. తెలుగులో పెద్ద సినిమాలేవీ లేకపోయినా తమిళం, హిందీల్లో మాత్రం పలు పెద్ద సినిమాలు బాహుబలి ఊపును తగ్గిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమైనా, వాటన్నింటికీ భిన్నంగా సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలబడింది.
ఇక ప్రధానంగా కోలీవుడ్‌లో అక్కడి స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ‘బాహుబలి’ టాప్‌లో నిలవడం విశేషం. మూడో వారాంతం కూడా అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతూ బాహుబలి, భారీ అంచనాల మధ్య విడుదలైన ధనుష్ మారి సినిమాను దాటి మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తమిళంలో విడుదలైన సినిమాల్లో చెన్నై నగరంలో బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ స్థానంలో శంకర్ ‘ఐ’ సినిమా నిలిచింది. ఈ సినిమా లాంగ్ రన్లో 8 కోట్లు కొల్లగొట్టింది. ఇక బాహుబలి ఇప్పటికే రెండో స్థానానికి వచ్చేసింది. ఇప్పటివరకూ చెన్నైలో బాహుబలి 5.5 కోట్లు కొల్లగొట్టింది.

