యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, అడవి శేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 200 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదల కాలేదు, 200 రోజులు పూర్తి చేసుకోవడం ఏంటి..? అనుకుంటున్నారా. ఇప్పటివరకు సినిమా యూనిట్ 200 రోజుల పాటు షూటింగ్ చేశారు. తెలుగు సినిమా హిస్టరీలో అత్యంత భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడుతున్నారు. ప్రధాన తారాగణం అంతా మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ తదితర అంశాలలో ట్రైనింగ్ తీసుకున్నారు.
ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రభాస్ తమ్ముడిగా రానా, రాజమాతగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారి సెట్టింగ్లతో పాటు కేరళ వంటి అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. రెండు పార్టులుగా సినిమాను విడుదల చేయనున్నారు. మొదటి పార్ట్ 2015 ప్రధమార్ధంలో విడుదల అవుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


