‘బాహుబలి’ పైరసీని అరికట్టేందుకు ‘జాండో’ ఆర్డర్!

‘బాహుబలి’ పైరసీని అరికట్టేందుకు ‘జాండో’ ఆర్డర్!

Published on Jul 8, 2015 12:49 PM IST

baahubali1
ఇప్పుడు ఏ నోట విన్నా, ఏ చోట కన్నా అంతటా ‘బాహుబలి’ ఫీవర్ పట్టేసుకుంది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ప్రతిష్టాత్మక సినిమా ఒకేసారి తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.

కాగా అన్ని సినిమాల్లానే బాహుబలి సినిమా కూడా పైరసీ అనే భూతానికి భయపడుతూనే ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్న ఆన్‌లైన్ పైరసీ ఈ సినిమాను మరింత భయపెడుతోంది. ఇక బాహుబలి పైరసీని అరికట్టేందుకు నిర్మాతలు ఇప్పటికే అన్ని చర్యలూ తీసుకుంటుండగా, నిర్మాతల మండలి కూడా ఈ విషయంలో తమ వంతు సహకారం చేస్తోంది. ఈ క్రమంలో పైరసీని అరికట్టేందుకు నిర్మాతల మండలి జాండో అనే ఆర్డర్‌ను ఉపయోగించనుంది.

ఈ ఆర్డర్ ప్రకారం ఏయే సైట్లు పైరసీకి పాల్పడుతున్నాయన్న ఆధారాలను సేకరించారో ఆ సైట్లన్నింటినీ దేశంలో ఇంటర్‌నెట్ సర్వీసును అందిస్తున్న సుమారు 350 ప్రొవైడర్లు బ్లాక్ చేస్తాయి. ఆ తర్వాత పుట్టుకొచ్చే కొత్త సైట్లను కూడా ఇదే క్రమంలో బ్లాక్ చేయనున్నారు. పైరసీని చూడకుండా తమ సినిమాను ఆదరించాలని దర్శకుడు రాజమౌళి ఈ సందర్భంగా ప్రత్యేకంగా విన్నవించారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు బాహుబలి సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేశాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు