
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. యావత్ దేశం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మే 31న భారీ ఎత్తున బాహుబలి ఆడియో విడుదలవుతుందని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులు ఆడియో రిలీజ్ వాయిదా పడడంతో నిరుత్సాహపడ్డారు. అయితే బాహుబలి ట్రైలర్‌ను అదే సమయానికి విడుదల చేసి అభిమానుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు రాజమౌళి. కాగా, వాయిదా పడిన తర్వాత ఆడియో రిలీజ్ విషయమై ఇప్పటివరకూ బాహుబలి టీమ్ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.
తాజాగా ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన ఆడియో విడుదల తేదీనీ బాహుబలి టీమ్ ప్రకటించింది. జూన్ 13న పెద్ద ఎత్తున ఆడియో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతిలో భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకను యువ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్వహించనుంది. ఈ వేడుకలో కీరవాణి ఆధ్వర్యంలో రూపొందిన ఆడియోతో పాటు, మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు. జూలై 10 తెలుగు, హిందీ, తమిళ, మళయాల భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే!

