హిందీలోనూ.. గ్రాండ్‌గా ‘బాహుబలి’ రిలీజ్..!

హిందీలోనూ.. గ్రాండ్‌గా ‘బాహుబలి’ రిలీజ్..!

Published on Apr 9, 2015 3:50 PM IST

Baahubali
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని గమనించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ ధరకు బాహుబలి హిందీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కరణ్ జోహార్ హిందీ హక్కులు తీసుకోవడం ద్వారా ఇటు బాహుబలి నిర్మాతలకు కూడా ప్లస్ అన్నది అందరికీ తెలిసిందే. కరణ్ జోహార్‌కి హిందీ సినిమా మార్కెట్‌పై ఉన్న పట్టు ఈ సినిమాకు బాగా ఉపయోగపడే అంశం.

బాహుబలి హిందీ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న కరణ్, అక్కడ ఈ సినిమాకు వీలైనంత ఎక్కువ ప్రమోషన్ జరిగేలా ప్లాన్ చేస్తున్నారట. ఒక డబ్బింగ్ సినిమాకు ఇప్పటివరకూ చేపట్టనంత ప్రమోషన్ ఈ సినిమాకు జరగనుందని తెలుస్తోంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్‍హిట్ చిత్రాలైన ‘విక్రమార్కుడు’, ‘మర్యాదరామన్న’ సినిమాలు హిందీలో రీమేక్ అయి మంచి విజయాన్ని సాధించాయి. రాజమౌళి గత చిత్రమైన ఈగను హిందీలో విడుదల చేసేందుకు రిలయన్స్ సంస్థ అప్పట్లోనే భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ ట్రాక్ రికార్డు సినిమా ప్రమోషన్‌లో ప్రధాన ఆకర్షణగా మారనుంది.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం సినిమాకు కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను ఈ నెలాఖర్లో విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. బాహుబలి మొదటి భాగాన్ని మే15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు