
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. విడుదలకు ముందే ఈ సినిమా సంచలనాలను సృష్టిస్తుంది. ఇప్పటికే నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను భారీ ధరకు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి పెద్ద సంస్థలు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలోనూ బాహుబలి మళ్ళీ సత్తా చూపించింది. సుమారు 9.6కోట్ల రూపాయలకు వైజాగ్ హక్కులు అమ్ముడయి రికార్డు సృష్టించింది.
‘బాహుబలి’ విషయంలో రాజమౌళి అన్నీ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సినిమాను అన్ని విధాలుగా ది బెస్ట్ సినిమాగా నిలిపేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, ఫైట్స్ అన్నీ భారీ ఎత్తున తలపెట్టి విజువల్ వండర్‌గా సినిమాను తయారుచేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి మొదటి భాగం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై నిర్మించబడుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ నెలాఖర్లోనే ఆడియో ఆవిష్కరణను చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ముందే ప్రకటించినట్లుగానే మే 15నే సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

