డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సరైన హిట్ కొట్టి చాలా సంవత్సరాలైపోయింది. వినాయక్ ది కూడా అదే పరిస్థితి. ఈ పదేళ్లలో ఎన్టీఆర్ ‘అదుర్స్’ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ తప్ప వినాయక్ తీసిన చిత్రాలేవీ చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేదు. పైగా సాయిధరమ్ తేజ్ తో చేసిన ‘ఇంటెలిజెంట్’ బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. అంతకు ముందు అఖిల్ తో చేసిన ‘అఖిల్’ సినిమాది కూడా అదే పరిస్థితి.
అందుకేనేమో ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్స్ తో ఏ స్టార్ హీరోలు సినిమా చెయ్యడాన్నికి ఇష్టపడట్లేదు. ఒక్క బాలయ్య తప్ప. పూరీకి ఏ హీరో డేట్లు ఇవ్వని టైంలో బాలకృష్ణ పిలిచి మరి ‘పైసా వసూల్’ ఛాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రం ఫ్లాప్ అయినా ఆ తర్వాత తీసిన ‘మెహబూబా’ అట్టర్‌ఫ్లాప్ అయినా బాలయ్య మాత్రం మాట వెనక్కి తీసుకోలేదు. పూరీ జగన్నాథ్‌తో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. దాంతో పూరీ బాలకృష్ణ కోసం సబ్జెక్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు.
తాజాగా బాలయ్య వినాయక్ తో ఓ సినిమా చెయ్యనున్నాడు. ఇంటెలిజెంట్’ తర్వాత బాలయ్య తప్ప వినాయక్ కు ఏ స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే వినాయక్ బాలయ్యకు భారీ హిట్ ఇవ్వాలని కసితో పని చేస్తున్నాడట. ఈ చిత్రంలో బాలయ్య ఫ్యాక్షన్ లీడర్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయ్యాక బాలయ్య వినాయక్ చిత్రం మొదలవుతుంది. ఇక బాలయ్య డేట్స్ కోసం ఒకప్పటి స్టార్ డైరెక్టర్ బి గోపాల్ ఎదురుచూస్తున్నారు. మరి ఈయనకి కూడా బాలయ్య ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.


