నందమూరి బాలకృష్ణ త్వరలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయబోతున్నాడు. సోషల్ మెసేజ్‌తో కూడిన పవర్ఫుల్ మాస్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి బాలయ్యపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసి, దసరా కానుకగా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘NBK111’ పూర్తి కాగానే ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘NBK112’గా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027 వేసవి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
అయితే కొరటాల శివ ప్రాజెక్ట్ లైన్లోకి రావడంతో బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రాల షెడ్యూల్లో కొన్ని మార్పులు చేశారు. దీనివల్ల దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేయాల్సిన సినిమా కాస్త ఆలస్యం కానుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూవీ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడటంతో, ఇది 2027 చివర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
