గత సంవత్సరం వేసవి కానుకగా విడుదలై నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా ‘లెజెండ్’. మార్చి 28, 2014న విడుదలైన ఈ సినిమా మే 1వ తేదీతో ఓ కొత్త రికార్డును నెలకొల్పనుంది. ఒకే థియేటర్లో 400 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమాగా లెజెండ్ నిలవనుంది. ఇటు కలెక్షన్ల పరంగానూ, అటు విమర్శకుల ప్రశంసల పరంగానూ సూపర్ అనిపించుకున్న లెజెండ్.. లాంగ్ రన్‌లో కూడా స్టడీగా నిలబడింది.
ప్రస్తుతం ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరులో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఎమ్మిగనూరులోని ఓ థియేటర్లో లెజెండ్ రోజుకు నాలుగు ఆటలతో 400 రోజులకు దగ్గరైంది. తెలుగు సినీ చరిత్రలో నాలుగు వందల రోజులు పూర్తి చేసుకున్న మొదటి సినిమాగా ‘లెజెండ్’ ఘనత సాధించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ సినిమాను 14రీల్స్, వారాహి సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ సినిమా 400రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మే 2న ఎమ్మిగనూరులో ఓ భారీ వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.


