నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 98వ సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం సాయంత్రం విడుదలయింది. కోర మీసం.. పసుపు రంగు గళ్ళ లుంగీ.. గాగుల్స్… వెరసి పక్కా మాస్ మసాలా లుక్ లో బాలయ్య అదరగొట్టాడు. ఇప్పటివరకూ చడీ చప్పుడు చేయని ఈ సినిమాపై ఒక్కసారిగా అభిమానులలో అంచనాలు ఊపందుకున్నాయి. ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కూడా కావడంతో పాజిటివ్ బజ్ ఏర్పడింది.
బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకు సత్యదేవ దర్శకుడు. ‘లెజెండ్’ తరహాలో ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


