సమీక్ష : ‘బందోబస్త్’ – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తోంది !

సమీక్ష : ‘బందోబస్త్’ – అక్కడక్కడా పర్వాలేదనిపిస్తోంది !

Published on Sep 21, 2019 3:01 AM IST
Bandobast movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 20, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా, బోమన్ ఇరానీ తదితరులు.

దర్శకత్వం : కె వి ఆనంద్

నిర్మాత‌లు : సుభాస్కరన్‌ అల్లిరాజా

సంగీతం : హరీష్ జయ్ రాజ్

సినిమాటోగ్రఫర్ : ఎం ఎస్ ప్రభు

ఎడిట‌ర్‌ : ఆంటోనీ

 

ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేస్తూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో ‘సూర్య’ ఒకరు. కాగా సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. కాగా ఈ డబ్బింగ్ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

భారత ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) ప్రజల మేలు కోరే స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు. నిజాయితీ గల ప్రధానిగా దేశానికి కీడు చేస్తోన్న వారి పై యాక్షన్ తీసుకోవటానికి ఆర్డర్స్ పాస్ చేస్తాడు. ఈ క్రమంలో రవి కిషోర్ (సూర్య) ఒక పవర్ ఫుల్ ఆఫీసర్. సీక్రెట్ ఆపరేషన్స్ లో భాగంగా తన డ్యూటీ చేస్తూ.. చంద్రకాంత్ వర్మకి దగ్గర అవుతాడు. ప్రధానికి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా రవి కిషోర్ (సూర్య) నియమించబడతాడు. ఈ క్రమంలో అంజలి (సయేషా సైగల్)తో ప్రేమలో పడతాడు రవి కిషోర్. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఉగ్రవాదుల పేరుతొ జరిగిన దాడిలో ప్రధాని చంద్రకాంత్ వర్మ చనిపోతారు. ఆ తరువాత ఎవరు ప్రధాని అయ్యారు ? అసలు ప్రధానిని చంపింది ఎవరు ? దాని వెనుకున్న రహస్యాన్ని చేధించడానికి రవి కిషోర్ ఏమి చేశాడు ? ఇంతకీ మహావీర్ (బోమన్ ఇరానీ) ప్రధాని హత్యకి సంబంధం ఏమిటి ? చివరికి రవి కిషోర్ అసలు నిందితులను పట్టుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

పొలిటికల్ యాక్షన్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చిన ఈ సినిమా యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది. అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి. ప్రధానంగా సినిమాలో పీఎం చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) పాత్ర హత్య జరగడం. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సూర్య మరియు మిగిలిన ప్రధాన పాత్రలు.. అలాగే సినిమాలోని కొన్ని విచారణ సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

ఇక పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్ తో సినిమాలో సీరియస్ నెస్ తో పాటు ఇంట్రస్ట్ ను కూడా బాగా మెయింటైన్ చేశారు. ఇక పీఎం చంద్రకాంత్ వర్మ అనే పాత్రలో మోహన్ లాల్ తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. సయేషా సైగల్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన హీరో ఆర్య కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు బోమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, తమ నటనతో ఆకట్టుకున్నారు

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు కె.వి. ఆనంద్ రాసుకున్న కాన్సెప్ట్ మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఆ కాన్సెప్ట్ కి తగట్లు సరైన ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. సెకెండాఫ్ లోని కొన్ని దృశ్యాలు అనవసరంగా సాగాతీశారు. అసలు సినిమా మొదలైన చాల సమయానికి గాని ప్రేక్షకులకు సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ పై ఒక క్లారిటీ రాదు. అలాగే హీరోకి హీరోయిన్లకు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథకు అనవసరం అనిపిస్తాయి. సరే లవ్ సీన్స్ కోసం వాటిని పెట్టారు అనుకున్నా.. ఆ సీన్స్ లో లవ్ గాని, కామెడీ గాని ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు.

పైగా సెకెండ్ హాఫ్ బాగా స్లోగా సాగడం, సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువ సేపు సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి. వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. అలాగే చాల కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకుడు చాలా సినిమాటిక్ గా చూపించాడు. కె.వి. ఆనంద్ టేకింగ్ తో ఆకట్టుకున్నా స్క్రిప్ట్ పరంగా మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరోలా ఉండేది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేసిన ఎం ఎస్ ప్రభు సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. సంగీత దర్శకుడు హరీష్ జయ్ రాజ్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ స్ లో నేపథ్య సంగీతం చాల బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. నిర్మాత సుభాస్కరన్‌ అల్లిరాజా పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు మంచి కథాంశం తీసుకున్నా.. ఆ కథాంశానికి తగ్గట్లు ఉత్కంఠభరితమైన కథాకథనాలను మాత్రం రాసుకోలేకపోయాడు. ఆయన స్క్రిప్ట్ మీద ఇంకా బాగా శ్రద్ద పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

 

తీర్పు :

కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, మోహన్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కొన్ని యాక్షన్ అండ్ పొలిటికల్ సీన్స్ తో మరియు సప్సెన్స్ తో సాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్నిచోట్ల ఆసక్తికరంగా సాగినా.. మొత్తానికి సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సూర్య – మోహన్ లాల్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కానీ, దర్శకుడు రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ గా సాగకపోవడం, కొన్ని కీలక సన్నివేశాలు బోర్ కొట్టించడం, అలాగే చాల సీన్స్ లో నాటకీయత ఎక్కువడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా ఈ ‘చిత్రం’ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చుతుంది. అయితే మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆకట్టుకోదు.

 

123telugu.com Rating : 2.75 /5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు