
‘కిక్ 2’ తర్వాత మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన సినిమా ‘బెంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగా, కొద్దిసేపటి క్రితం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్ధమైపోయింది. ‘కిక్ 2’తో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రవితేజ, ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో ‘బెంగాల్ టైగర్’ విషయంలో పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నారు. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బెంగాల్ టైగర్‌ను రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందించారు.
ఇక సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ బృందం తరపున సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రవితేజ మార్క్ యాక్షన్, కామెడీ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఎమోషన్ కూడా ఈ సినిమాలో బలంగా ఉంటుందని తెలిపిన దర్శకుడు సంపత్ నంది, బెంగాల్ టైగర్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు.

