బిగ్ బాస్ సీజన్-9లో టాప్-5 ఫైనలిస్ట్‌గా నిలిచిన ప్రముఖ హీరోయిన్ సంజనా గర్లాని తాజాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం తన ప్రమేయం లేకుండా జరిగిన కొన్ని సంఘటనలు జీవితాన్ని, కెరీర్‌ను కుదిపేసినా.. ఒక ఫైటర్‌లా నిలబడి పోరాడి విజయం సాధించానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గెలుపు తన ఒక్కరిది కాదని, కష్టకాలంలో అండగా నిలిచిన తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అభిమానులదేనని స్పష్టం చేశారు.
బిగ్ బాస్ షో ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని, సమాజంలో మళ్లీ తలెత్తుకుని తిరిగే ఆత్మవిశ్వాసాన్ని ఈ వేదిక అందించిందని సంజనా పేర్కొన్నారు. షో హోస్ట్ నాగార్జునకు తాను వీరాభిమానిగా మారానని, ఆయన ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. ఇకపై తెలుగు సినిమాలపైనే పూర్తి దృష్టి సారిస్తానని, ఇప్పటికే కొన్ని అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలోని తన డైలాగ్ చెప్పి అలరించిన సంజన.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ‘విజనరీ వౌస్’ సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


