టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం ‘బైకర్’ మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇండియన్ తొలి మోటోక్రాస్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ సినిమాను అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. డాల్బీ సినిమా, EPIQ, 4DX మరియు PCX వంటి హై-ఎండ్ ఫార్మాట్లలో ఈ చిత్రం విడుదల కానుండటం విశేషం. ఇందులో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పాజిటివ్ రిపోర్ట్‌ను సొంతం చేసుకుంది. 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో టెక్నీకల్ వాల్యూస్‌కు తోడు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో శర్వానంద్ పర్ఫార్మెన్స్, రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు క్లిఫ్ జంప్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.
ఇక సినిమా సెకండ్ హాఫ్ విషయానికొస్తే.. తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ ట్రాక్ మరియు క్లైమాక్స్‌లో వచ్చే రేసింగ్ సీక్వెన్స్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. శర్వానంద్ కెరీర్‌లో ఈ సరికొత్త ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.
