బాలీవుడ్‌ను కాపాడిన మన తెలుగు సినిమాలు

Published on Jun 27, 2019 12:00 am IST

తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ కాబడి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తుంటే కొందరు విమర్శకులు, బీ టౌన్ సెలబ్రిటీలు మాత్రం వివక్ష చూపుతున్నారు. అందుకు కారణం ఈ రీమేక్ సినిమాను తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయడమే. బాలీవుడ్ ప్రేక్షకులు తెలుగు సినిమాల పట్ల ఎక్కువగా సంతృప్తి చెందుతూ సౌత్ దర్శకులని చూసి నేర్చుకోండి అంటూ అక్కడి దర్శకులకు సూచిస్తుండటంతో లోపల దాగి ఉన్న ఈ వివక్ష ఇప్పుడు బయటపడింది.

తెలుగు సినిమాల పట్ల ఇంతలా వర్రీ అయిపోతున్న బాలీవుడ్ వ్యక్తులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అక్కడి స్టార్ హీరోలు, దర్శకులు చాలా మందిని నిలబెట్టింది, వారి మార్కెట్ స్థాయిని పెంచింది తెలుగు సినిమా కథలే అనే సంగతి అర్థమవుతుంది. సల్మాన్ ఖాన్ కెరీర్లో భారీ విజయాల్లోని కిక్ మన తెలుగు దర్శకుడు సురేందర్ రెడ్డి చేసిన కిక్ సినిమాకి రీమేక్. అలాగే వాంటెడ్ చిత్రం పూరి యొక్క పోకిరి సినిమాకు రీమేక్. శ్రీను వైట్ల చేసిన రెడీ చిత్రాన్ని సైతం అదే పేరుతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సల్మాన్ ఖాన్.

ఇక మరొక స్టార్ హీరో అక్షయ్ కుమార్ రాజమౌళి తీసిన విక్రమార్కుడు చిత్రాన్ని రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. అజయ్ దేవగన్ సైతం రాజమౌళి చిత్రం మర్యాద రమ్మన్నను సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేకే చేశారు. ఇటీవల వచ్చిన భాగీ 2 మన క్షణం సినిమాకు రీమేక్. రణ్వీర్ సింగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న సింబా పూరి డైరెక్ట్ చేసిన టెంపర్ చిత్రానికి రీమేక్. ఇవే కాకుండా రీసెంట్ హిట్స్ ‘ఎఫ్ 2, ఆర్ఎక్స్ 100, గూఢచారి, జెర్సీ’ సినిమాల రీమేక్ హక్కుల్ని భారీ ధర పెట్టి కొన్నారు అక్కడి ఫిల్మ్ మేకర్స్.

ఇలా తెలుగు దర్శకులు, రచయితల కథలతో భారీ విజయాల్ని చూసింది బాలీవుడ్. అలాంటి తెలుగు దర్శకుల పట్ల అక్కడి కొందరు వివక్ష చూపడం తగ్గించుకుని సినిమాకు భాషా బేధాలు ఏమాత్రం అడ్డుకావనే సంగతిని గుర్తిస్తే మంచిది.

సంబంధిత సమాచారం :

More