
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. ప్రతిష్టాత్మక పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవం సినిమా లాంచ్ అయింది.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు మహేష్ బాబు సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. జూలై 10నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కే ఈ ఫ్యామిలీ డ్రామాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇక వచ్చే నెలలో షూటింగ్ మొదలుపెట్టి డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలన్నది నిర్మాతల ప్లాన్.
సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న విషయం తెలిసిందే! త్వరలోనే మెయిన్ హీరోయిన్‌గా ఎవరు నటించనున్నారన్నది తెలియజేయనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు’ చివరిదశకు చేరుకుంది. జూలై 17న ‘శ్రీమంతుడు’ సినిమా విడుదల కానుంది.

