విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం అక్టోబర్ రేసులో నిలిచింది. ఇటీవల విడుదలైన టీజర్‌లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటం, దర్శకుడు త్రివిక్రమ్‌కు వర్క్ పూర్తి చేసేందుకు మరికొంత సమయం కావలసి రావడంతో సినిమా ఓ వారం ఆలస్యంగా, అంటే అక్టోబర్ 9న థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఈ ఆలస్యం ప్రచారంతో అక్టోబర్ 2న బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయి.
ఫహద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’, చిన్న చిత్రం ‘తెల్లకాగితం’లతో పాటు సందీప్ కిషన్ ‘సిగ్మా’ కూడా అదే తేదీని టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్లను ప్రకటించాయి. ‘ఆదర్శ కుటుంబం’ వారం రోజులు వెనక్కి వెళ్తుందనే ధైర్యంతోనే ఈ చిత్రాల నిర్మాతలు ముందడుగు వేశారు. అయితే ఒకవేళ వెంకటేష్ సినిమా చెప్పిన సమయానికే వస్తే మాత్రం, ఈ మిగతా చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకోక తప్పదు.


