’కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కథానాయకుడిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ అనే ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ సింగ్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా కోసం చిత్ర బృందం దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ చారిత్రక కావ్యంలో శివాజీ మహారాజ్ సైనిక వ్యూహాలను, యుద్ధ నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయిలో చూపించడం కోసం ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘వైకింగ్స్’ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రాలకు పనిచేసిన హాలీవుడ్ యాక్షన్ డిజైనర్ మార్క్ హెన్సన్ బృందాన్ని రంగంలోకి దించారు.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం రిషబ్ శెట్టి పూర్తిగా సరికొత్త మేకోవర్ కానుండగా, ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘జై హనుమాన్’ షూటింగ్ పూర్తి కాగానే ఈ చిత్ర బృందంతో కలవనున్నారు. మహారాష్ట్రలోని కీలకమైన చారిత్రక ప్రాంతాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. శివాజీ మహారాజ్ తల్లి రాజమాత జిజాబాయి పాత్రలో షెఫాలీ షా నటిస్తుండగా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా వివేక్ ఒబెరాయ్, మరో పరాక్రమవంతుడైన విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
