తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్‌గా ‘కరుప్పు’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. గత పదమూడేళ్లుగా తన కెరీర్ హయ్యెస్ట్ కలెక్షన్స్ మార్కును దాటలేక, తెలుగు వంటి కీలక మార్కెట్లలో సైతం ఒడిదొడుకులు ఎదుర్కొన్న సూర్య.. ఈ సినిమాతో ఏకంగా రూ.300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఈ సక్సెస్ కిక్కుతో ఆయన మార్కెట్ వాల్యూ భారీగా పెరిగింది. ఎంతగా అంటే, ఆయన నెక్స్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కు ముందు అనుకున్న రేట్ల కంటే ఇప్పుడు ఏకంగా డబుల్ రేట్లు వస్తున్నట్లు సమాచారం.
ఈ క్రేజీ సక్సెస్ తర్వాత సూర్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ‘జై భీమ్’ లాంటి మర్చిపోలేని క్లాసిక్ అందించిన దర్శకుడు టీజె జ్ఞానవేల్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. జ్ఞానవేల్ ఇటీవలే రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టాయన్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పటికీ, సూర్యతో చేయబోయే సినిమా కోసం ఒక అద్భుతమైన బయోపిక్‌ను సిద్ధం చేశాడట. చెన్నైకి చెందిన ప్రముఖ వైద్యులు, పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువేంగడం జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.
డాక్టర్ తిరువేంగడం ఛాతీ వ్యాధుల నిపుణుడిగా, ‘వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ మెడిసిన్’ గా పేరుగాంచారు. కార్పొరేట్ ఆసుపత్రులు వందల రూపాయలు వసూలు చేసే రోజుల్లో, ఆయన కేవలం 2 లేదా 5 రూపాయల ఫీజుతోనే పేదలకు వైద్యం అందించి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆరేళ్ల క్రితం 94 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఈ లెజెండరీ వైద్యుని జీవితంలోని ఎత్తుపల్లాలు, అవమానాలు, విజయాలను దర్శకుడు జ్ఞానవేల్ వెండితెరపై ఆవిష్కరించబోతున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, సూర్య మరో పవర్‌ఫుల్ మరియు స్పెషల్ రోల్‌లో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.


