ఇంటర్వ్యూ: నితిన్ – కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు సినిమాను నిర్మించడం వలన కొంత ఒత్తిడి ఫీలవుతున్నాను !

నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా ఏప్రిల్ 5న విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) మళ్ళీ ప్రేమ కథే చేయడానికి కారణం ?
జ) ‘లై’ సినిమాకి ముందే ఈ కథని అనుకున్నాం. కానీ డెవెలప్ చేయడానికి చాలా సమయం పట్టింది. అంతేగాని ప్రత్యేకంగా ప్రేమ కథే చేయాలని చేయలేదు.

ప్ర) త్రివిక్రమ్ గారు కథ ఇవ్వగానే మీరే డైరెక్ట్ చేయండి అని మీరు అడగలేదా ?
జ) లేదు. అప్పటికే ఆయన బిజీ షెడ్యూల్లో ఉండటం వలన కుదరలేదు. కథ, పాత్రలు అన్నీ త్రివిక్రమ్ గారే ఇచ్చారు. వాటిని తీసుకుని కృష్ణ చైతన్య డెవలప్ చేసి సినిమా చేశారు.

ప్ర) మీ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించడానికి కారణం ?
జ) ముందుగా త్రివిక్రమ్ గారు, నేను చేద్దామనుకున్నాం. ఆ విషయాన్ని త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారికి చెబితే మీరు చేస్తున్నప్పుడు నేను కూడ చేస్తాను అని చేశారు.

ప్ర) సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంత ఫన్ ఉండే పాత్రను ఎప్పుడూ చేయలేదు. ఇందులో నా పేరు మోహన్ రంగ. అమెరికా వెళ్లాలని ట్రై చేస్తుంటాను.

ప్ర) సినిమా రిలీజ్ పట్ల ఒత్తిడి ఫీలవుతున్నారా ?
జ) ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇందులో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లాంటి వారు ఇన్వాల్వ్ అయ్యున్నారు. వారి పేరు దెబ్బతినకుండా సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను.

ప్ర) మీ హీరో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రచారానికి రమ్మంటే వెళ్తారా ?
జ) నాకు రాజకీయాల పట్ల అంత ఆసక్తిలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో జనాలకు మంచి చేద్దామని వచ్చారు. అయన పిలిస్తే తప్పకుండా ప్రచారానికి వెళ్తాను.

ప్ర) ఇది మీ 25వ సినిమా. ఈ జర్నీ ఎలా ఉంది ?
జ) విజయాలు, అపజయాలు, ఎత్తు పల్లాలు అన్నీ ఉన్నాయి ఈ ప్రయాణంలో. అందుకే చాలా బాగా అనిపిస్తోంది.

ప్ర) మొదటిసారి తమన్ తో పనిచేశారు ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. తమన్ పాటలకు మంచి సంగీతం ఇచ్చారు. రీ రికార్డింగ్ అయితే ఇంకా బాగుంటుంది.

ప్ర) ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి అతిధి పాత్రలో ఏమైనా నటించారా ?
జ) అలాంటిదేం లేదు. సినిమాలో ఆయన ఉండరు కానీ ఉన్నట్టే ఉంటారు. అది ఎలా అనేది సినిమాలోనే చూడాలి.