
అక్కినేని వంశంలో మూడో తరం నుంచి గ్రాండ్ ఎంట్రీకి ‘అఖిల్’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ సిద్ధమైన విషయం తెలిసిందే. నవంబర్ 11న దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా కోసం అఖిల్ టీమ్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. దర్శకుడు వీవీ వినాయక్, నిర్మాత నితిన్, హీరో అఖిల్ ఇలా అందరూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ‘అఖిల్’కు హైప్ తీసుకొస్తున్నారు.
ఈ ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం అఖిల్ ట్విట్టర్‌లో అభిమానులతో సరదాగా ముచ్చటించారు. వారడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు అఖిల్ సమాధానాలిస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచారు. ఇక “మీ డ్యాన్స్ మూవ్స్ చాలా బాగున్నాయి. టాలీవుడ్‌లో మీ ఫేవరైట్ డ్యాన్సర్ ఎవరు?” అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్, “డ్యాన్స్ విషయంలో నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన రీ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అనే సమాధానమిచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్‌లో అఖిల్ డ్యాన్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని సినిమా యూనిట్ ధీమాగా ఉంది.