దర్శకరత్న దాసరి నారాయణరావు గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యతో భాదపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ను పరామర్శించగా ఈరోజు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసుపత్రికి వెళ్లి దాసరిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని మీడియాకు వివరించారు.
చిరు మీడియాతో మాట్లాడుతూ ‘దాసరిగారిని కలిశాను. ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఏంతంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే పేపర్ పై ఖైదీ సినిమా ఎంత షేర్ కలెక్ట్ చేసింది అని అడిగారు. ఆయన చాలా కోలుకున్నారు. ఇంకో రెండు మూడు రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారు. రెండు మూడు రోజులుగా చాలా కంగారు పడ్డాం. ఆయన్ను చూడగానే మాక్కూడా ధైర్యం వచ్చింది. ఆయనలో పాత దాసరి కనిపిస్తున్నారు’ అన్నారు. చిరంజీవితో పాటు దర్శకుడు వినాయక్, అల్లు అరవింద్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు.


