శ్రీకాంత్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ ఆవిష్కరించిన చిరంజీవి.. జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్

సినీ నటుడు శ్రీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’ (నోటరీ పరశురామ్). ఈ ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఆవిష్కరించారు. సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను నిర్మించారు. 7 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ ఒరిజినల్ సిరీస్, జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో అందుబాటులోకి రానుంది.

కోర్టు ప్రాంగణంలో నారాయణ అనే వ్యక్తి తన కుమార్తె సమీర కోసం ఆత్మాహుతి చేసుకోవడంతో ట్రైలర్ ప్రారంభమై కథలో తీవ్రతను పెంచుతుంది. అది ఆత్మహత్య కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని ప్రచారం సాగడంతో పరిస్థితులు వేడెక్కుతాయి. మరోవైపు, ‘ఏ బ్లాక్’ వైపు వెళ్లేందుకు కూడా ఇష్టపడని లాయర్ పరశురామ్ (శ్రీకాంత్).. ఏళ్ల తరబడి కేసులు తీసుకోకపోయినా, ఊహించని విధంగా ఈ కేసును చేతుల్లోకి తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది.

కేవలం ప్రచారం, డబ్బు కోసమే పరశురామ్ ఈ డ్రామా ఆడుతున్నాడని సీనియర్ లాయర్ ముఖేష్ రుషి ఆరోపించడం, సొంత కొడుకే తండ్రిని వైఫల్యం చెందిన లాయర్‌గా భావించడం వంటి సన్నివేశాలు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పరశురామ్ గతంలో ఏం జరిగింది? అసలు సమీర కిడ్నాప్ వెనుక ఎవరున్నారు? పరశురామ్ ఈ కేసును ఎలా గెలిచాడు అనేది సిరీస్ కథాంశం.

ఈ సిరీస్‌లో అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించగా, సూర్య ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు.

Exit mobile version